- కేటీఆర్‌పై మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ బీఆర్ఎస్ పార్టీలో చేరలేదని, కేవలం పాత బీఆర్ఎస్ కార్యకర్తలకే మళ్లీ గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ చేరికలంటూ హడావుడి చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహబూబాబాద్ నియోజకవర్గం ఎప్పటికీ కాంగ్రెస్‌కు కంచుకోట అని, రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ ఇతర పార్టీ కూడా గెలిచే అవకాశమే లేదని మురళీ నాయక్ స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్తున్నట్టుగా కేసీఆర్ ప్రజల గుండెల్లో లేరని, ఆయన ఎప్పుడో ప్రజలకు దూరమై ఫామ్‌హౌస్ గడీలకే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వందకుపైగా స్థానాలను గెలుచుకుని పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
